రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజే (Vasundhara Raje) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Rajasthan Assembly Elections) జరగనున్న విషయం తెలిసిందే.
ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే మరోమారు ఝలావర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకుంది.
ఈ సభలో తన కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ప్రసంగించిన తర్వాత రాజే మాట్లాడారు. ‘నా కుమారుడు ప్రసంగం విన్న తర్వాత.. నేను ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని అనిపిస్తోంది. దుష్యంత్ పట్ల ప్రజలు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తున్నాడు. ప్రజలు తనని సరైన మార్గంలోనే నడిపిస్తున్నారు. దుష్యంత్ సింగ్ గురించి నాకు ఇక ఎలాంటి బెంగా అవసరం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
అదేవిధంగా ఝలావర్ రీజియన్ మూడు దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో నడుస్తోందని రాజే తెలిపారు. రోడ్లు, నీటి సరఫరా పథకాలు, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీ బాగా పెరిగిందని చెప్పారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబర్ 25న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటు రాజస్థాన్ ఓట్లను కూడా లెక్కించనున్నారు.