రాష్ట్రంలో సంక్రాంతి పండుగ(Sankranti Festival) సందడి మొదలైంది. ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) నేటి నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. గురువారం నుంచి హైదరాబాద్(Hyderabad) నుంచి గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో నగరంలో కొన్ని చోట్ల రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ(TS RTC) అధికారులు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా పలు సూచనలు చేశారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి యాదగిరిగుట్ట, మోత్కూరు/తొర్రూరు వైపు వెళ్లే బస్సులు నిలిపే ప్రాంతాలను మార్చినట్లు వెల్లడించారు.
అదేవిధంగా హన్మకొండ వైపు వెళ్లే బస్సులు యథావిధిగా ఆగుతాయన్నారు. యాదగిరిగుట్ట, తొర్రూరు బస్టాప్‌ను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి మార్చారు. ఒక్కో బస్టాప్ 300 మీటర్ల గ్యాప్‌తో ఏర్పాటు చేశామన్నారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ తెలిపారు.
సాధారణ, ప్రత్యేక బస్సులు ఈ సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్ సమీపంలోని బస్టాప్ నుంచి బయల్దేరతాయని వివరించారు. ప్రయాణికులందరూ దీనిని దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇళ్లకు వెళ్లే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
ప్రధాన రద్దీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, ఆరంగర్ వంటి ప్రధాన ట్రాఫిక్ పాయింట్లలో కొత్తగా 36 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కెమెరాలన్నింటినీ బస్‌భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.