ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న ఉచిత పథకాలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదీ ప్రజలకు ఫ్రీగా ఇవ్వకూడదు.. విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలని అన్నారు. పల్నాడు (Palnadu) జిల్లా నరసరావుపేట (Narasa Raopet)లో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఇంగ్లీష్ నేర్చుకోండి.. కానీ, తెలుగుని మర్చిపోవద్దని సూచించారు..
మొదట మాతృభాషను చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై ఆసక్తి చూపాలని పేర్కొన్నారు. కన్న తల్లిదండ్రుల్ని దైవానికంటే ఎక్కువగా ప్రేమించాలని తెలిపారు.. మరోవైపు ఎన్నికల్లో గెలవడం కోసం ప్రభుత్వాలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదని వెంకయ్యనాయుడు వెల్లడించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు..
పోయిన తర్వాత నలుగురు మనల్ని గుర్తుంచుకోవాలంటే మంచి పనులు చేస్తూ.. న్యాయబద్ధంగా జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. మనిషి శారీరకంగా ధృడంగా ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటారని తెలిపిన వెంకయ్యనాయుడు.. ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని కోరారు. ప్రస్తుతం ప్రజల జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయని.. క్షణం తీరిక లేకుండా ఉంటూ.. ఫాస్ట్ఫుడ్ కల్చర్ కి బాగా అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకొంటున్నట్టు గుర్తు చేశారు..
మరోవైపు మనదేశంలో ఉన్నన్ని రుచులు దేశంలో ఎక్కడ లేవని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇంట్లో వంట రూమ్, పూజా రూమ్ తప్పకుండా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఆనందంగా జీవించడం అలవాటు చేసుకోవాలని తెలిపారు..