చెన్నై నగర మాజీ మేయర్, తమిళ సినీ దర్శకుడు వెట్రి దురైస్వామి(Vetri Duraisamy) ప్రమాదానికి గురయ్యారు. ఆయన మృతదేహం ప్రమాదానికి గురైన తొమ్మిది రోజుల తర్వాత లభ్యమైంది. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని కిన్నౌర్ జిల్లా(Kinnaur district)లో వెట్రి ప్రయాణిస్తున్న కారు ఫిబ్రవరి 4వ తేదీన ప్రమాదానికి గురైంది.
సట్లెజ్ నదిలో కారు దూసుకెళ్లడంతో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా వెట్రితో పాటు కారులో ప్రయాణిస్తున్న గోపినాథ్ అనే మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్శకుడు వెట్రి దురైస్వామి నదిలో గల్లంతయ్యారు.
ఆయన తండ్రి సదాయి దొరైస్వామి భారీ రివార్డును ప్రకటించారు. వెట్రి ఆనవాళ్లను గుర్తించిన వారికి రూ.కోటి నజరానా ప్రకటించారు. నదిలో పడిన వెట్రి కోసం చాలా బృందాలు గాలించాయి. ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, జిల్లా పోలీసులు అన్వేషించారు.
మహిన్ నాగ్ అసోసియేషన్‌కు చెందిన గజ ఈతగాళ్ల బృందం వెట్రి మృతదేహాన్ని గుర్తించింది. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. వెట్రి దురైస్వామి ‘ఇంద్రావతు ఒరునాల్’ అనే తమిళ చిత్రాన్ని వెట్రి డైరెక్ట్ చేశారు.