పశ్చిమ బెంగాల్ లో సిలిగురి సఫారీ పార్కు (Siliguri Safari Park)లో సింహాలకు అక్బర్ (Akbar), సీత (Sita) పేర్లు పెట్టడంపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయంపై కోల్కతా హైకోర్టున వీహెచ్పీ ఓ పిటిషన్ దాఖలు చేసింది.
ఇటీవల ఈ రెండు సింహాలను త్రిపురాలోని సిపాహిజలా జూ పార్క్ నుంచి ఉత్తరబెంగాల్ లోని సిలిగురి సఫారీ పార్కుకు తీసుకు వచ్చారు. వాటికి ఇటీవల మొఘల్ పాలకుడు అక్బర్, శ్రీ రాముడి భార్య ‘సీతా’పేరును అధికారులు పెట్టారు.
సింహానికి సీత అని పేరు పెట్టడం మొత్తం హిందూ సమాజం మతపరమైన మనోభావాలను కించపరచడమే అని పిటిషన్ లో వీహెచ్పీ వెల్లడించింది. ఒక జంతువుకు మతపరమైన దేవత పేరు పెట్టడం హిందువుల మత విశ్వాసాలను అవమానించడమే అవుతుందని వీహెచ్పీ తన పిటిషన్లో పేర్కొంది.
ఇది ఖచ్చితంగా దైవదూషణ కిందకు వస్తుందని తెలిపింది. అందువల్ల ఆడ సింహం పేరును మార్చాలని పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్ పై ఈ నెల 20న హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు సింహాలకు తాము అలాంటి పేరు పెట్టలేదని ఉత్తర బెంగాల్ పార్క్ అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 12న ఆ సింహాలను పార్క్ కు తీసుకు వచ్చామని… ఇప్పటి వరకు అలాంటి పేరు పెట్టలేదంటున్నారు.