కాళేశ్వరం (Kaleshwaram), మేడిగడ్డ ప్రాజెక్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండవ రోజు విజిలెన్స్, ఎన్ ఫోర్స్మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు సోదాలు (Searches) నిర్వహిస్తున్నారు. కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయాల్లో నిన్న కీలకమైన రికార్డులు, హార్డ్ డిస్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం నుంచి మరోసారి సోదాలు చేస్తున్నారు.
ఇటీవల మేడిగడ్డ బ్యారేజీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎండీ హరిరామ్, ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల పాటు నిన్న తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ తర్వాత డాక్యుమెంట్లను పరిశీలించారు. హైదరాబాద్ తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు. మరోవైపు నిన్న రాత్రి కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పలు కీలక రికార్డులు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వాటన్నింటినీ డివిజన్ కార్యాలయానికి తరలించారు. అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మేడిగడ్డ గెస్ట్ హౌస్‌లో అధికారులు బస చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం మరోసారి మహదేవ్పూర్ నీటి పారుదలశాఖ కార్యాలయంలో సోదాలు చేశారు. ప్రాజెక్టు డిజైన్, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక, పంప్ హౌస్ గోడ కూలడానికి దారితీసిన పరిస్ధితులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు
ఇది ఇలా వుంటే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపిస్తామన్నారు. దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జిని నియమించాలని హైకోర్టు సీజేకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారని పేర్కొన్నారు.