పార్టీ మారడం అంటే పక్కోడి గోచి లాగినంత సులువు అయ్యింది నేటి రాజకీయాల్లో అని కామెంట్స్ వస్తున్నా.. కండువాలు మార్చడం మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే లెక్కలేనంతగా కార్యకర్తలు, నేతలు పార్టీలు మార్చారు. ఆ సమయంలో తమని నమ్ముకున్న అనుచరులు ఏమౌతారనే ఆలోచన కనీసం వారి బుర్రకు తట్టిందో లేదో తెలియదు.. కానీ ఈ విషయంలో మాత్రం కొందరు నిరాశ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు కొన్నాళ్లుగా బీజేపీ (BJP) అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి (vijaya Shanthi)..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అదీగాక బండి సంజయ్ (Bandi Sanjay)ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి అప్పగించడాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు విజయశాంతి. ఇటీవల ప్రధాని మోడీ, అమిత్ షా బహిరంగ సభలకు సైతం హాజరుకాలేదు రాములమ్మ..
ఇదే సమయంలో విజయశాంతి పార్టీ మారుతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా కీలక నిర్ణయం తీసుకుని ఇలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెట్టారు.. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి..పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు విజయశాంతి. మరోవైపు రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఏఐసీసీ నాయకులు విజయశాంతితో మంతనాలు జరిపి.. హస్తాన్ని అందుకుంటే.. మెదక్ ఎంపీ స్థానంతో పాటు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బీజేపీని వీడి.. హస్తం గూటికి చేరారు. ఈ క్రమంలో విజయశాంతి రాజీనామాను ముందే ఊహించిన కమలం నేతలు.. ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. మరి ఇప్పటికైనా రాములమ్మ హస్తాన్ని విడవకుండా ఉంటారా? లేదా? అనేది మిలియన్ ప్రశ్నలా జనం మదిలో మిగిలిపోయింది.