అందరూ ఊహించినట్టే బీజేపీ (BJP)కి షాక్ ఇచ్చి కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్నారు సీనియర్ రాజకీయ నాయకురాలు సినీ నటి విజయశాంతి. 1998లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయశాంతి మొదట కమలం కండువా కప్పుకున్నారు. తర్వాత పార్టీలు మారుతూ చివరికి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇక బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి.. కమలం నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని చెప్పడంతో తాను బీజేపీలో చేరానని విజయశాంతి గుర్తు చేశారు. కానీ తెర ముందు ఒకటి, తెర వెనుక మరొక డ్రామా జరుగుతుందని వెల్లడించారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి నేతలే కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి కేసీఆర్ ను ప్రశ్నిస్తుండటం చిత్రంగా ఉంది.. అధికారం వారి చేతిలో ఉంచుకుని ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నట్టని.. అరెస్ట్ చేయించాలంటే కేంద్రానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించిన విజయశాంతి.. దీనికి మోడీ సమాధానం చెప్పాలన్నారు.
మరోవైపు బీజేపీని మోడీ, కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారని ఆరోపించిన విజయశాంతి.. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటి కావటంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరానని వివరించారు. ఏ శత్రువుతో పారాడుతున్నామో అదే శత్రువుతో చేతులు కలిపి..బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి మార్చిందని, వద్దని తాను ఎంత చెప్పిన అధిష్టానం చెవికి ఎక్కించుకోలేదని విజయశాంతి ఆరోపించారు.