– రెండు రోజుల్లో కాంగ్రెస్ లోకి విజయశాంతి
– మల్లు రవి కీలక వ్యాఖ్యలు
– పార్టీ మార్పుపై మాట దాటేసిన రాములమ్మ
తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈమె కాంగ్రెస్ లో చేరికపై ఆపార్టీ నేత మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. విజయశాంతి తమ పార్టీలోకి రాబోతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు జరిగాయని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో ఆమె అధికారికంగా హస్తం గూటికి చేరుతారని అన్నారు.
గత కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీ, అమిత్ షా కార్యక్రమాలకు కూడా హాజరైనా దాఖలాలు లేవు. దీంతో విజయశాంతి బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం మెదలైంది. ఇన్ని అనుమానాల మధ్య బీజేపీ జాబితాల్లోనూ రాములమ్మ పేరు కనిపించలేదు. దీంతో ఆమె పార్టీ మారతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.
అయితే.. మల్లు రవి తాజాగా దాన్ని కన్ఫామ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాములమ్మకు మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమెను మీడియా ప్రశ్నించగా.. మోడీకి వెల్ కమ్ చెప్పేందుకు బేగంపేటకు వచ్చానని.. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను స్పష్టంగా ఖండించలేదు.