పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో నేతలు చేసుకొంటున్న విమర్శలు సైతం పెరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు చర్చలకు దారి తీస్తుండగా.. హస్తం నేతలు కూడా గట్టిగానే సమాధానాలు చెబుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో గులాబీ పార్టీ కనుమరుగు కానుందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొందనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గులాబీ నేతల్లో ధైర్యం నింపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుకొంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ప్రకటిస్తే రాష్ట్రంలో 30 సీట్లు కూడా కాంగ్రెస్ (Congress)కు వచ్చేవి కాదని కేటీఆర్ విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
‘భవిత రహిత సమితి (బీఆర్ఎస్) నేత కేటీఆర్.. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు 30 స్థానాలు వచ్చేవి కాదు అన్నారు. కానీ, అదే ఎన్నికలలో బీఆర్ఎస్, కేసీఆర్ (KCR)ని సీఎంగా ప్రకటించి 64 స్థానాలు గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మూడో సారి సీఎం అవడం ఖాయమని.. రాష్ట్ర ప్రజలు ఆయన వైపు ఉన్నారని జోరుగా ప్రచారం చేసుకొన్న విషయాన్ని విజయశాంతి గుర్తుచేశారు..
ఇంతలా ఊకదంపుడు ప్రచారం చేసుకొన్న బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే గెలవడం గుర్తుంచుకోవాలని సూచించారు.. ఇక బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్పై వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ను ప్రజలు గెలిపించారని వ్యాఖ్యానించారు. అవును బీఆర్ఎస్పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ను గెలిపించారు. ఎవరైనా అనుకూలతతో గెలిపిస్తారా అని విజయశాంతి ప్రశ్నించారు. మీరు చేస్తున్న ఆరోపణలు ప్రజలకు అర్థం కావట్లేదని ట్వీట్ చేశారు.