తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ (BRS) నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం పాలన సాగించదని..రాష్ట్రంలో త్వరలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కొందరు నేతలు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. అహంకార ధోరణితో ప్రవర్తించిన బీఆర్ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆరోపణలు చేశారు.
రాష్ట్రం, కల్వకుంట్ల కుటుంబం సొంతం అయ్యినట్టు భావించి పెత్తనం చెలాయించాలని చూసిన బీఆర్ఎస్ నేతలు.. ప్రజలను చీమల్లా చూశారని విజయశాంతి (Vijayashanti) ఆరోపించారు. దొరల పెత్తందారి వ్యవస్థను కూల్చిన కాంగ్రెస్.. సుపరిపాలన అందిస్తూ కొనసాగుతుందని తెలిపారు.. అయితే కేసీఆర్ ని కలిసి బయటకొస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణల వెనక.. కేసీఆర్ హస్తం ఉందని విజయశాంతి మండిపడ్డారు..
అధికార స్వార్ధం, అహంకారం, దోపిడి, దుర్మార్గ నియంతృత్వ వ్యవస్థలను నాటి నుంచి నేటి వరకు ప్రజలు ఎదిరిస్తూనే ఉన్నారని.. గత చరిత్రలో ఎందరో ఇలాంటి వారు నియంతలా మిగిలారే తప్పా.. నిజమైన నాయకునిగా ప్రజల గుండెల్లో ఉండలేకపోయారని విజయశాంతి గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు టీఆర్ఎస్ అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండేదని.. కానీ స్వార్థంతో బీఆర్ఎస్ గా మారడంతో ఆ నమ్మకం కోల్పోయారని విజయశాంతి వెల్లడించారు.
బీఆర్ఎస్ నేతల ప్రకటన వెనుక… ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం నవ్వులపాలు అవుతుందని తెలిపిన విజయ శాంతి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ప్రజాస్వామ్యవాది అయినట్టయితే మీ పార్టీ నేతలు చేసిన ప్రకటన తప్పని చెప్పండంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకున్న మీకు, కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదంటూ విజయశాంతి మండిపడ్డారు..