ఏపీ(AP)లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నేతల(TDP Leaders) మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పోస్టుల దాడులు చేస్తున్నారు. తాజాగా విజయవాడ (Vijayawada)లో వంగవీటి రాధా, బోండా ఉమా మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది.
రాజకీయ ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకు ముదురుతోంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు కొనసాగుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల నుంచి పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీరి కోల్డ్ వార్తో ఏపీ రాజకీయాలు మరింత రసరవత్తరంగా మారాయి.
ఈ పోస్టులు ఉమా వర్గీయులు చేసిన పనే అని రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఉమా టార్గెట్గా సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. రాధా వర్గమే ఇది చేసినట్లు ఉమా వర్గం భావిస్తోంది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు వైరల్ అయ్యాయి. రాధాపై ఏడు పాయింట్లతో పోస్టులు చేయగా.. ఉమాపై పదిహేడు పాయింట్లతో పోస్టులు చేయడం గమనార్హం.
“ఈసారి టికెట్ రాదని అధికార పార్టీతో చర్చలు జరపాలా, అలా చేస్తేనే పార్టీ నమ్ముతుందా? పదవి కోసం పార్టీని బెదిరించాలా..? చిన్న పిల్లల చావుకి కారణం అవ్వాలా..? దేవుడి పేరుతో చందాలు పోగెయ్యాలా? కార్పొరేటర్ టికెట్లు అమ్ముకోవాలా..? పదవి రాకపోతే కాపుల గొంతుకోసారని పార్టీకి, కులానికి మధ్య విరోధం పెంచాలా..?” అంటూ ప్రశ్నలు సంధిస్తూ చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి.