మహరాష్ట్ర (Maharashtra) గిరిజన శాఖా మంత్రి విజయ్‌కుమార్ గావిట్ మాటలు టాక్ ఆప్ ది స్టేట్ అయ్యాయి. ఇంతకీ ఆయన చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఏమిటంటే ”ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) లాంటి కళ్లు కావాలంటే చేపలు తినాలనాలి, చేపలు తింటే చర్మ సౌందర్యం పెరుగుతుంది, కళ్లలో కాంతులు మెరుస్తాయి, అందరూ మీవైపే ఆకర్షితులు అవుతారు”. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్రదుమారమే రేగింది.
గిరిజనశాఖా మంత్రి తీరును ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ చెత్త వాగే బదులు గిరిజనాభివృద్ధి కోసం ఏమైనా చేయొచ్చుగా అంటూ ఎన్సీసీ( NCP) నేత అమోల్ మిత్కారీ స్ట్రైట్ గా, ఘాటుగా విమర్శిస్తే, తాను రోజూ చేపలు తింటున్నప్పటికీ ఐశ్వర్యారాయ్ లాంటి కళ్లు రాలేదేంటంటూ బీజేపీ (BJP) ఎమ్మెల్యే నితేశ్ రాణే(Nitesh Rane)వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
అందం, ఆకర్షణ అంటూ బాహ్య సౌందర్యాన్ని ప్రాధాన్యతగా చూపకుండా ఆరోగ్యహితం కోసం చేపలు తినమని చెప్పి ఉంటే ఇంత గోల అయ్యేది కాదేమో అని విజయ్ కుమార్ గావిట్ బహుశా ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ ఉండొచ్చు.