పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ (BJP)కి షాక్ తగిలింది. యువనేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు మూల విక్రమ్ గౌడ్ (Vikram Goud) పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి నేడు తన రాజీనామా లేఖను పంపించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.. మోడీ నాయకత్వం పట్ల విశ్వాసంతో 2020 లో బీజేపీలో చేరినట్లు తెలిపారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నా విక్రమ్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టిక్కెట్ ఆశించారు. కానీ అధిష్టానం రాజాసింగ్ (Raja Singh) వైపు మొగ్గు చూపడంతో.. చిన్నబుచ్చుకొన్న విక్రమ్ గౌడ్ కు.. కిషన్ రెడ్డి నచ్చజెప్పారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ఆశించిన ఆయనకు అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో.. చిత్తశుద్ధితో పని చేసినా పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదని భావిస్తూ పార్టీ మారాలనే నిశ్చయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు విక్రమ్ గౌడ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పని చేయాలని ఆదేశిస్తున్నారన్నారు. పార్టీలో చేరి దాదాపు మూడున్నర సంవత్సరాలలో బీజేపీ అభివృద్ధికి, పార్టీ అభ్యర్థుల గెలుపునకు పని చేశానని తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలను వదిలేసి కొంతమంది నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, పార్టీ రాష్ట్ర నాయకుల తొత్తులుగా మారిన వారికే న్యాయం జరిగిందని విక్రమ్ గౌడ్ మండిపడ్డారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో బలం పెంచుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీపై యువనేత రాజీనామా ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో అనే ఆసక్తి రాజకీయాల్లో నెలకొంది.