నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన చిత్రం బ్లాక్‌బస్టర్ సినిమా ‘జైలర్’(Jailer). ఈ చిత్రంలో విలన్‌గా చేసిన వినాయకన్ (Vinayakan) తన నటనతో సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యారు. కానీ నిజ జీవితంలో కూడా ఆయన విలన్‌గానే ప్రవర్తించడంతో అభాసుపాలయ్యారు. తాజాగా ఆయనని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
వినాయకన్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని వారంతా ఆయనపై కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ.. అపార్ట్‌మెంట్ వాసులంతా ఆయనపై చేసిన ఫిర్యాదు మేరకు వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీసులు స్టేషన్‌ను పిలిపించారు.
స్టేషన్‌కు వచ్చిన వినాయకన్ మద్యం మత్తులో ఉండటంతో పాటు.. తనని పోలీసు స్టేషన్‌కు పిలిపిస్తారా? అంటూ.. సహనం కోల్పోయి పోలీసులతోనే గొడవకు దిగినట్లు సమాచారం. పోలీసులు ఆయన పట్ల సహనంగా వ్యవహరించినా వినాయకన్ కంట్రోల్ కాకపోవడంతో చేసేది లేక అతడిపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వినాయకన్ అరెస్ట్ తర్వాత అతని గురించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా అతనిని పోలీసులు అరెస్ట్ చేశారని, కానీ ఆయనలో మార్పు మాత్రం రావడం లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అతడిని అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారని అక్కడి మీడియా సర్కిల్స్‌లో సైతం వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన బెయిల్‌పై బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.