విశాఖపట్నం(Vishakapatnam) ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour)లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంగతి విధితమే. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 40 బోట్లు దగ్ధమయ్యాయి. మరో 40 బోట్లు ధ్వంసమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తోంది.
ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఆ ఫుటేజీలో ఫిషింగ్‌హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం జరగడానికి రెండు నిమిషాల ముందు ఇద్దరు వ్యక్తులు బయటకు వస్తున్నట్లు రికార్డయి ఉంది. ఆ వీడియోలో ఆ ఇద్దరి వ్యక్తుల ముఖాలు, వారు వెళ్తున్న సమయం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈనెల 19వ తేదీన రాత్రి 10:48గంటలకు బోటు నుంచి ఇద్దరు వ్యక్తులు బయటికి రాగా రెండు నిమిషాల్లోనే అంటే.. రాత్రి 10.50గంటలకు బోటులో మంటలు చేలరేగడం గమనార్హం. దీంతో ప్రమాద ఘటనతో ఆ ఇద్దరు వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
పోలీసులు ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తులనే గుర్తించే పనిలో పడ్డారు. సీసీ ఫుటేజ్‌తో కేసు మొత్తం మరో మలుపు తిరిగింది. అంతకుముందు యూట్యూబర్ నాని.. పలువురు యువకులు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ తరుణంలో సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు మరికొన్ని కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు.