తెలంగాణాకి భారీ వర్షాల (Heavy Rains) ముప్పు ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణా (Telangana) లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ (Weather Dept) అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద మరింత బలపడిందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిమీ వరకు వ్యాపించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వాలి ఉందని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
అల్పపీడనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడ గంటలకు 40 నుంచి 45 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, ఉభయ గోదావరి, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.