రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి (Temperature Drops). దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారం నుంచి రాత్రిపూట తగ్గిన ఉష్ణోగ్రతలతో జనం గజగజలాడుతున్నారు. తీవ్రమైన చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు , రగ్గులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌లో ఉన్ని దుస్తులకు గిరాకీ బాగా పెరిగింది.
మరోవైపు నేపాలీలు నిర్వహించే దుకాణాల్లో ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండే వస్తువులు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. చలిని తప్పించుకొనేందుకు అన్ని రకాల దుస్తులు లభిస్తుండటంతో నేపాలీలు (Nepalis) నిర్వహించే దుకాణాల్లో రద్దీ పేరుతోందని తెలుస్తోంది. అదీగాక ఇతర దుకాణాల్లో కన్నా తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా నేపాలీలు అమ్ముతున్న ఉన్ని వస్త్రాలు కొంటున్నారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. మెదక్, అదిలాబాద్‌లో 12 నుంచి 13 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతుండగా.. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో టెంపరేచర్ 15 డిగ్రీలకు పడిపోయింది. మరోవైపు చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉపశమనం పొందేందుకు ఉన్ని వస్త్రాలు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. హనుమకొండ ఉలెన్ మార్కెట్‌లోని దుకాణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి.
మరోవైపు హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో చలి తీవ్రత (cold weather) క్రమంగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.