Telugu News » Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు కారణాలేంటి..? ఇదే బాటలో ఉన్న నేతలెవరు..?

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు కారణాలేంటి..? ఇదే బాటలో ఉన్న నేతలెవరు..?

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం మామూలు విషయం కాదు. రాష్ట్రంలో హైదరాబాద్ కే పరిమితమైన బీజేపీని గ్రామగ్రామానికి తీసుకెళ్లడంలో బండి సంజయ్ పాత్ర కీలకమైందని.. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించడంపై కొందరు నేతలు బహిరంగంగానే తప్పుబట్టారు.

by admin
Komati-Reddy-Rajgopal-Reddy

– బీజేపీలో రాజగోపాల్ రెడ్డి కలకలం
– రాజీనామాకు కారణాలపై జోరుగా చర్చ
– అధ్యక్ష మార్పే పక్క చూపులకు బీజం వేసిందా?
– నిజంగా.. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయా?
– రాజగోపాల్ దారిలో నడిచే నేతలెవరు..?

బీజేపీ (BJP) కి గుడ్ బై చెప్పేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy). ఈ సందర్భంగా అగ్ర నేతలకు ధన్యవాదాలు చెబుతూనే.. పార్టీలో పరిస్థితులపై తనదైన రీతిలో చురకలంటించారు. బీజేపీ గ్రాఫ్ పడిపోయిన తీరును వివరించారు. దీంతో అనేక అంశాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రజల్లో వీటిపైనే జోరుగా చర్చ సాగుతోంది.

బీఆర్ఎస్ (BRS) ను గద్దె దించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ.. బీజేపీలో చేరారు రాజగోపాల్ రెడ్డి. ఆయన రాక, మునుగోడు (Munugode) ఉప ఎన్నికలో గెలుపు విజయానికి బాటలు వేస్తాయని అగ్ర నేతలు సైతం భావించారు. కానీ, వర్కవుట్ కాలేదు. మునుగోడులో ఓటమి తప్పలేదు. అయితే.. ధన బలం, అధికార బలగాన్ని ప్రయోగించి బీఆర్ఎస్ గెలిచినా.. ఓడినట్టేనని బీజేపీ చెప్పుకొచ్చింది. ఈ ఓటమి తర్వాత బీజేపీలో కూల్ గా తన పని తాను చేసుకుపోయారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ (KCR) తో ఢీ అంటే ఢీ అనేలా పోరాటం చేశారు. కానీ, ఎప్పుడైతే పార్టీ అధ్యక్ష మార్పు జరిగిందో అప్పటి నుంచి ఆయన తీరులో మార్పు వచ్చింది.

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ్ని మార్చడం మామూలు విషయం కాదు. రాష్ట్రంలో హైదరాబాద్ (Hyderabad) కే పరిమితమైన బీజేపీని గ్రామగ్రామానికి తీసుకెళ్లడంలో బండి సంజయ్ (Bandi Sanjay) పాత్ర కీలకమైందని.. ఆయన స్థానంలో కిషన్ రెడ్డి (Kishan Reddy) ని నియమించడంపై కొందరు నేతలు బహిరంగంగానే తప్పుబట్టారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలోనే.. అధ్యక్ష పదవి నుంచి సంజయ్ ను తొలగించిన సమయంలో ఆయన్ను చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. బాత్రూంకి వెళ్లి ఏడ్చానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అధ్యక్ష మార్పు తర్వాత బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ పడ్డాయనే వార్తలు మరింత ఊపందుకున్నాయి. పైగా, కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని ఢిల్లీ నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఒకటే పాట పాడుతుండడం.. చర్యలు లేకపోవడంతో కొందరు నేతలకు నచ్చలేదు. రహస్య మీటింగులు పెట్టుకున్నారు. అదీగాక, ముందొచ్చిన తమను కాదని.. ఈటల రాజేందర్ (Eatala Rajender) కు ప్రాధాన్యత ఇవ్వడంపైనా అలకబూనారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీలోకి వచ్చిన సీనియర్లు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వారిలో రాజగోపాల్ రెడ్డి ఒకరు. గంపగుత్తగా కొందరు నేతలు కాంగ్రెస్ (Congress) గూటికి వెళ్తారని కూడా ప్రచారం సాగింది. కానీ, ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే బీజేపీకి గుడ్ బై చెప్పారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బాటలో ఎవరు నడుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ లో అనేక అవమానాల తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి.. మళ్లీ బీజేపీ గూటికి చేరారు విజయశాంతి (Vijayasanthi). ఈమె కూడా కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే, వివేక్‌ వెంకటస్వామి, చాడ సురేష్‌ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గరికపాటి మోహనరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రవీంద్ర నాయక్‌, విజయ రామారావు ఇలా కొందరు నేతలు రహస్య మీటింగులో పాల్గొన్నారు. వీరిలో ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చారు. దీంతో వీరిలో ఇంకా ఎవరు బీజేపీకి గుడ్ బై చెబుతారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరికొన్ని నేటి రాజకీయ వార్తల కోసం ఇక్కడ చదవండి ! మరిన్ని బ్రేకింగ్ న్యూస్ తెలుగు లో…!

You may also like

Leave a Comment