Telugu News » SC Classification and Sub Plan : వర్గీక”రణం”..!! ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

SC Classification and Sub Plan : వర్గీక”రణం”..!! ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

2014 ఎన్నికల సమయంలో బీజేపీ కూడా దీనిపై హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఇప్పుడు ప్రధాని మోడీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు.

by admin
modi-madakrishna

– ప్రధాని మోడీ హామీతో..
– ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా?
– 29 ఏళ్ల మాదిగల కల నెరవేరుతుందా?
– వర్గీకరణ జరిగితే మాలలకు నష్టమా?
– ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఏంటి?
– ఎందుకు తీసుకొచ్చారు..?
– ఆ లక్ష్యం నెరవేరుతోందా?
– ‘రాష్ట్ర’ ప్రత్యేక కథనం

ఎస్సీ వర్గీకరణ ఎన్నో ఏళ్ల ఉద్యమం. దీనికోసం ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు మాదిగలు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో చిన్నగా మొదలై.. తర్వాత రాష్ట్రమంతా విస్తరించింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పీఎస్ దీనిపై ఇప్పటికీ దీనికోసం యుద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన, న్యాయపరమైన ఇతర చిక్కులతో ఈ అంశం తేలడం లేదు. అయితే.. ప్రధాని మోడీ మాదిగల ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ సబ్ ప్లాన్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

what-is-sc-classification-and-sc-st-sub-plan

షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్‌ తో మొదలైంది ఎస్సీ వర్గీకరణ పోరాటం. రెండు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీటిలో మాల, మాదిగ ప్రధానం. మిగతావి ఉప కులాలు. ఎస్సీల్లో మాల కులానికి చెందిన వాళ్లు సామాజికంగా, విద్యాపరంగా ముందజంలో ఉన్నారు. కానీ, వీరి జనాభా మాదిగలతో పోలిస్తే చాలా తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 మంది, మాలలు 55,70,244 మంది. ఎస్సీ రిజర్వేషన్లన్నీ మాలలే ఎక్కువగా అనుభవిస్తున్నారంటూ మాదిగ, దాని ఉప కులాలు ఆరోపిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాల కోటాలో ఉద్యోగాలు, అవకాశాలు వారికే ఎక్కువగా లభిస్తున్నాయని, సమన్యాయం కోసం షెడ్యూల్డ్ కులాల కోటాను దామాషా ప్రకారం వర్గీకరించాలనే డిమాండ్ మొదలై ఉద్యమానికి దారితీసింది.

ఎస్సీలకు మొత్తంగా 15 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. దీనివల్ల ప్రధానంగా మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనేది మాదిగల వాదన. ప్రభుత్వాలు మారుతున్నా దీనిపై ఇచ్చిన హామీలు అలాగే ఉండిపోయాయి. నిజానికి, విద్యా, ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. అలాగే, రాజకీయ పరంగా కూడా సీట్ల కేటాయింపులోనూ అన్యాయం జరుగుతోందని.. ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి, ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్‌ ను తెరపైకి తెచ్చింది ఎమ్మార్పీఎస్.

రామచంద్ర రాజు కమిషన్ నివేదిక ప్రకారం 2002 నాటి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించింది. మొత్తం 15 శాతంలో మాదిగ దాని ఉప కులాలకు 7 శాతం, మాల, దాని ఉప కులాలకు 6 శాతం, ఇతర కులాలకు 2 శాతం వర్గీకరించి అమలు చేసింది. అయితే,, ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రిజర్వేషన్లు రద్దయ్యాయి. 2008 లో మరోసారి వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఈ నివేదిక ప్రకారం కూడా ఎస్సీల్లో మాదిగలు వెనుకబడి ఉన్నారని తేలింది. వర్గీకరణకు పార్లమెంట్‌ లో చట్టం చేయాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు.

2014 ఎన్నికల సమయంలో బీజేపీ కూడా దీనిపై హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఇప్పుడు ప్రధాని మోడీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ కు సంబంధించి మాదిగల సాధికారత కోసం సాధ్యమైన అన్ని మార్గాలను అవలంబించేందుకు కేంద్రం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని మోడీ తెలిపారు. అయితే.. దేశంలో అనేక రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. మాల మహానాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. సబ్-కేటగరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుందని వాదిస్తోంది. ఇది మొత్తంగా ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని అంటోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయా షెడ్యూల్డ్ కులాలకు వాటి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్ కోటా దక్కడం లేదు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా కొన్ని షెడ్యూల్డ్ కులాలకే ఎక్కువ లాభాలు సమకూరాయి. అయితే.. వీటిలో తేడాలు కూడా ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక కులం నష్టపోతే, అదే కులం మరో రాష్ట్రంలో అధిక లబ్ధి పొందుతోంది.

ఇటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపైనా జోరుగా చర్చ జరుగుతోంది. స్వ‌తంత్ర భార‌తం ఎస్సీ, ఎస్టీల బతుకుల్లో ఎలాంటి మార్పులు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ప్ర‌భుత్వాలు దీనికి తగిన చిత్త‌శుద్ధితో కృషి చేయ‌లేదనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఎస్సీ, ఎస్టీల అభ్యున్న‌తి కోసం ప్ర‌త్యేకంగా నిధులు కేటాయిస్తున్నారే గానీ.. వాటిని సక్రమంగా అమలు చేయడం లేదనే విమర్శలను ఎదుర్కొన్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే దారి మ‌ళ్లుతున్న నిధుల్ని స‌క్ర‌మ మార్గం ప‌ట్టించడానికే ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ ను తీసుకొచ్చారు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్న‌తి, సంక్షేమం కోసం బ‌డ్జెట్ లో ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించ‌డం స‌బ్ ప్లాన్ ల‌క్ష్యం. వీటిలో 40 శాతం మూల‌ధ‌న నిధులు ఎస్సీ, ఎస్టీల మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి కేటాయించాల్సి ఉంటుంది. 2013 ఉమ్మడి ఆంధ్రాలో ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ కు సంబంధించిన చ‌ట్టం ఆమోదించారు. అంత‌కు ముందు వరకు ప్ర‌భుత్వాలు నిధులు కేటాయించిన‌ప్ప‌టికీ వాటిని స‌క్ర‌మంగా వినియోగించలేదనే ఆరోపణలు ఉన్నాయి. నిధులను ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌ళ్లించేవారు. దాంతో స‌బ్ ప్లాన్ తెరపైకి వచ్చింది. ప్ర‌తి బ‌డ్జెట్ లో ఎస్సీల జ‌నాభా ప‌రంగా 16.23 శాతం నిధుల్ని కేటాయిస్తారు. అలాగే, ఎస్టీల జ‌నాభా ప‌రంగా 6.6 శాతం నిధుల్ని ఇస్తారు. స‌బ్ ప్లాన్ ల‌క్ష్యం వారికి కేటాయించిన నిధుల్ని వారికే ఖ‌ర్చు పెట్ట‌డం. కానీ, ప్ర‌భుత్వాలు ఇప్పటికీ దీన్ని స‌క్ర‌మంగా అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిధులు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు పేప‌ర్ల మీద చూపిస్తున్నారే గానీ. వాటిని సరిగ్గా ఖ‌ర్చు చేయడం లేదని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై ఫోకస్ పెట్టామని చెప్పిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపైనా జోరుగా చర్చ జరుగుతోంది.

You may also like

Leave a Comment