అయోధ్య (Ayodhya)లో జనవరి 22న రామ మందిర (Ram Mandhir) ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. జనవరి 23 తర్వాత ‘రామ్ లల్లా’దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు. దీంతో అయోధ్య రామున్ని దర్శించుకునేందుకు భక్తులు రెడీ అవుతున్నారు. అయితే అయోధ్యలో ఆ శ్రీరాముడి దర్శనంతో పాటు పలు ప్రముఖ ఆలయాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. అయోధ్యలో గల ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా… అయితే వివరాలు మీ కోసం
హనుమాన్ గర్హి :
అయోధ్యకు వెళ్లే వారు దర్శించుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో హనుమాన్ గర్హి ఒకటి. ఈ ఆలయాన్ని దర్శించుకోకుండా అయోధ్య దర్శనం అనేది పరిపూర్ణం కాదంటారు. త్రేతాయుగంలో అయోధ్య రక్షణకు వచ్చిన హనుమంతుడు ఈ ప్రాంతంలోనే ఉండే వారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో బేసిన్ లడ్డుకు తాజాగా జీఐ ట్యాగ్ వచ్చింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ ఈ ఆలయాన్ని సందర్శించారు.
రామ్ కథా పార్క్ :
ఇక అయోధ్యలో చూడాల్సిన మరో ప్రదేశం రామ్ కథా పార్క్. ఇందులో శ్రీ రామునికి సంబంధించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రార్థనలు, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో సాయంత్రం నిర్వహించే లేజర్ షో కార్యక్రమం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వీటన్నింటినీ చూస్తే రాముని జీవిత విశేషాలు మన కండ్ల ముందు కదలాడుతాయి. ఈ ప్రాంతం గార్డెన్స్, శిల్పాలతో అత్యంత ప్రశాంతంగా ఉంటుంది.
కనక్ భవన్ :
ఇక అయోధ్యలో కనక్ భవన్ అనేది అత్యద్బుతమైన ఆలయం. ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి. ఈ భవనం బుందేల్ ఖండ్ రాజ భవనాన్ని పోలి ఉంటుంది. సీతారాముల వివాహానంతరం సీతాదేవీకి కైకేయి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చారని రామాయణం ప్రకారం తెలుస్తోంది. ఆ తర్వాత ఈ భవనాన్ని పలుమార్లు పునరుద్దరించినట్టు చెబుతారు.
దేవకాళి ఆలయం :
ఈ ఆలయం ఫైజాబాద్ లో ఉంది. అయోధ్యకు నైరుతి దిశలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఉండే మాతా గిరిజా దేవీ విగ్రహానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ విగ్రహాన్ని సీతా దేవీ తనతో పాటు తీసుకు వచ్చిందని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. దేవకాళి ఆలయాన్ని దశరథ మహారాజు నిర్మించారని చెబుతారు. అనంతరం ఆలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతూ ఉంటారు.
సీతాకీ రసోయ్:
అయోధ్యలో చూడాల్సిన మరో ఆలయం సీతాకీ రసోయ్. రాజ్ కోట ప్రాంతంలో ఉంది. సీతా దేవీ స్వయంగా ఉపయోగించిన చారిత్రాత్మక వంట గదిగా దీన్ని పేర్కొంటారు. ఇక్కడ ఆలయంలో సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. సీతా దేవీ ఉపయోగించినట్టుగా చెబుతున్న వంట పాత్రలు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తాయి.
గుప్త ఘాట్ :
గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలను చూస్తే అంతా తమను తాము మైమరిచి పోతారు. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, సీతా దేవి, లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని విశ్వశిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని గుప్తర్ ఘాట్ అని పిలుస్తున్నారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం కనిపిస్తుంది.
రామ్ కీ పైడి..
సరయు నది ఒడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధమైన ఘాట్ ఈ రామ్ కీ పైడీ. ప్రతి యేటా ఇక్కడ ఛోటి దీపావళి రోజు ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు సరయు నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలు పాటిస్తారు. ఇక్కడ వచ్చే భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లేవారు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి తర్వాతి కథనంలో చూద్దాం.