Wheat Price : దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన సర్కార్.. తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. దీపావళి లోగా ఈ ‘కానుక’ ప్రజలకు అందుతుందని వెల్లడించింది. ముఖ్యంగా పెరిగిపోతున్న గోధుమ (Wheat) ధరలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. దీని దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కూడా యోచిస్తోంది. దేశీయ ధరలను తగ్గించేందుకు గత ఏడాది సర్కార్ గోధుమ ఎగుమతిపై నిషేధం విధించిందని, ఇప్పుడు ఈ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా (Sanjeev Chopra) తెలిపారు.
రిటైల్ మార్కెట్ లో దీని ధర ఇంకా తగ్గవలసి ఉందన్నారు. గోధుమ, పిండి (Flour) ధరలు తగ్గడానికి ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ లో మిల్లులకు, ఇతర ట్రేడర్లకు దీన్ని అమ్ముతోందన్నారు. బియ్యానికి (Rice) సంబంధించి.. ప్రభుత్వ స్థాయిలో.. ఇప్పటివరకు భూటాన్ నుంచి 80 వేల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాలన్న అభ్యర్థన మన దేశానికి వచ్చిందన్నారు. బ్రోకెన్ రైస్,నాన్ బాస్మతి వైట్ రైస్ ఎగుమతిపై ఇప్పటికే నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (Open Market Sale Scheme) కింద ప్రభుత్వం సెంట్రల్ పూల్ నుంచి ఒకటిన్నర మిలియన్ టన్నుల గోధుమలను ప్రైవేటు వ్యాపారులు, పిండి మిల్లులు, బల్క్ కొనుగోలుదారులకు విక్రయించాలని నిర్ణయించామని, వచ్చే ఏడాది మార్చి లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్దేశించామని సంజీవ్ చోప్రా వివరించారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే ఇలాంటి చర్యలు తీసుకుని తమ విజయానికి బాటలు వేసుకోవాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది.
గత ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో గోధుమ సేకరణ తగ్గిపోయింది. అసాధారణ వేడి వాతావరణం కారణంగా దిగుబడి తగ్గడంతో నష్టం వచ్చింది. ప్రొక్యూర్మెంట్ 2021-22 సంవత్సరానికి 43.4 మిలియన్ టన్నుల నుంచి ఇది ఒక్కసారిగా 18.8 మిలియన్ టన్నులకు తగ్గింది. అందువల్లే ముఖ్యంగా గత మే నెలలో గోధుమ ఎగుమతిని ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే ప్రస్తుతం గోధుమ పంట దిగుబడి పెరగడంతో.. దీని ఎగుమతిపై గల నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని కూడా పరిశీలించే అవకాశాలున్నాయి. కానీ దీని ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ను అందుకున్న పక్షంలోనే ఇది సాధ్యపడుతుంది.