గాజాలో ప్రస్తుత పరిస్థితి నరక ప్రాయంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ జనరల్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. గాజాలో మరణించిన వారిలో 70 శాతం పిల్లలు, మహిళలే ఉన్నారని చెప్పారు. కాల్పుల విరమణకు ఈ కారణం ఒక్కటి చాలని తెలిపారు. ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గాజా పరిస్థితి గురించి తాను చెప్పలేకపోతున్నానని అన్నారు. గాజాలో పరిస్థితిని మాటల్లో చెప్పలేమని వెల్లడించారు. యుద్దం అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదన్నారు. యుద్దం మరోసారి ఘర్షణను మరింత పెంచుతుందన్నారు. అది మరింత ద్వేషాన్ని, బాధలను మరింత అధికం చేస్తుందని వివరించారు. అందువల్ల ఇజ్రాయెల్-పాలస్తీనాను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇక ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ చిన్నతనంలో యుద్ధ పరిణామాలను కండ్లారా చూశారు. 1998-2000లో ఎరిత్రియాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో జరిగిన యుద్దంలో తన పిల్లలు బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. సమస్యలకు యుద్ధం ఎలాంటి పరిష్కారం చూపించదని, ఇది తన సొంత అనుభవంతో చెబుతున్నానని చెప్పుకొచ్చారు.
అందువల్ల సమస్యను శాంతియుతంగా, రాజకీయ మార్గంలో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే గాజాలో ఆకలి, అంటు రోగాలతో మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అధనామ్ వ్యాఖ్యలపై ఐరాసలోని ఇజ్రాయెల్ రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధనామ్ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసినప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ వైఖరి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌లో సామాన్యులపై జరిగిన దాడులు, మహిళలపై అత్యాచారాలు, బందీలు, ఆస్పత్రులను మిలిటరీ కేంద్రాలుగా మార్చుకోవటం లాంటి తీవ్రమైన చర్యల గురించి అధనామ్ ప్రస్తావించలేదని ఫైర్ అయ్యారు.