మేడిగడ్డ ప్రాజెక్టు అంశం సీరియస్ గా తీసుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఉన్న లోటుపాట్ల విషయంపై ఆచితూచి వ్యవహరిస్తోన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకి జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రస్తావనతో ముందుకి వెళ్ళిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక సైతం ఇదే అంశంలో పావులు కడుపుతోందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project)పై మాజీ సీఎం ఇప్పటి వరకు ఎందుకు నోరెత్తలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ప్రశ్నించారు.. మరోవైపు అక్టోబర్ 21న పిల్లర్లు కుంగితే, సీరియస్ గా దర్యాప్తు, పరిశీలన కూడా జరగలేదని ఉత్తమ్ వెల్లడించారు.. కాళేశ్వరం మెంటనెన్స్ విషయంలో, నిర్మాణం చేసిన సంస్థని ప్రశ్నిస్తే.. ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి కేసీఆర్ (KCR) చెప్పినట్లే నిర్మించామని ఇంజినీర్లు తెలుపుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు..
మరోవైపు సీఐజీ రిపోర్టు ప్రకారం కాళేశ్వరం (Kaleswaram) కింద 40 వేల ఎకరాలకే నీరు అందుతోందని ఉత్తమ్ అన్నారు. రూ.లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు శూన్యమని ఆయన తెలిపారు. ఇదేకాకుండా.. రూ.25 కోట్లు వెచ్చించిన పాలమూరు ప్రాజెక్టు కింద సైతం కొత్త ఆయకట్టు శూన్యమని ఉత్తమ్ పేర్కొన్నారు.. కాగా మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం తీవ్రమైన లోపభూయిష్టంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు..
మరోవైపు పేదలకు అందుతోన్న రేషన్ సరకులపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యానికి రూ.39 మాత్రమే ఖర్చు పెడుతున్నాయని అన్నారు. కేంద్రం 5 కిలోల బియ్యం ఇస్తే రాష్ట్రం అదనంగా కిలో మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల పౌరసరఫరాల శాఖ రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు ఇచ్చిందని గుర్తు చేసిన ఉత్తమ్.. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చాయని వెల్లడించారు..