నేతలు చెప్పినట్టు తెలంగాణ (Telangana)లో నిజంగానే అభివృద్ది జరిగింది.. మద్యం రికార్డు స్థాయిలో అమ్ముడు పోవడంలో కనిపిస్తున్న అభివృద్ది చూసిన కొందరు ఈ మాటలంటున్నారు. ఏ ప్రభుత్వ హాయమంలో ఇంతలా లిక్కరు అమ్ముడు పోకపోవడం నిజంగా విడ్డూరమే అంటున్నారు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణ మార్చిన క్రెడిట్ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి చెల్లుతుందని కితాబ్ ఇస్తున్నారు..
ఇందుకు నిదర్శనంగా ప్రస్తుతం నో స్టాక్ బోర్డుతో కనిపిస్తున్న వైన్ షాపులు (Wine shops) చూపిస్తున్నారు.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ అని సిరివెన్నెల రాసిన ఈ పదాలు అక్షరాల తెలంగాణకు వర్తిస్తాయని ఈ దృశ్యాలు చూస్తున్న కొందరు వెల్లడిస్తున్నారు.
మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో వైన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం.. డబ్బులతో ఓట్లను కొనుక్కోవాలనే నాయకులు రాజకీయాల్లో ఉండటం.. యువత ఆలోచించవలసిన సమయమని అంటున్నారు.. మరో వైపు పోల్ మేనేజ్ మెంట్ టీమ్స్.. లిక్కర్ షాపులతో డీల్స్ పెట్టుకున్నట్టు ప్రచారం.. చివరి రెండు రోజులు పోల్ బూత్ కమిటీ సభ్యులకు, ఓటర్ స్లిప్స్ రాసే కుర్రోళ్లు.. టెంట్స్ దగ్గరి పార్టీ కార్యకర్తలు, నేతలను మేనేజ్ చేయటానికి సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.
పోలింగ్ దగ్గర పడటంతో మందు దొరకదనే ముందు జాగ్రత్తతో ఆయా పార్టీల టీమ్స్ పెద్ద ఎత్తున లిక్కర్ నిల్వ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో హైరానా.. హంగామా.. హడావిడి పడి పరువుతీసుకోవడం కంటే.. ముందుగానే కొని పెట్టేసుకుంటే బెటర్ అనే ఆలోచనతో.. వైన్ షాపులను ఖాళీ చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు ప్రచారం జరుగుతుంది.