రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ(AP), తెలంగాణ (Telangana)లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లకే పరిమితమవుతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి.
కార్తీకమాసం ముగిసిన తర్వాత నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో రోడ్లు, రహదారులపై పొగమంచు కమ్ముకుంటోంది. వాహనదారులు రోడ్లపై లైట్లు వేసుకుని వెళ్లాల్సివస్తోంది. తాజాగా తెలంగాణలో రాగల రెండు, మూడు రోజుల పాటు చలితీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయి. దీని కారణంగా ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ఏరియాలో చలి పంజా విసురుతోంది. ఇప్పటికే ఏపీ ప్రజలు మిచాంగ్ తుపాను ప్రభావంతో నానా అవస్థలు పడ్డారు. వరదలతో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారు.
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ వైఫల్యంతో రోడ్లు బాగాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు తోడవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయని ఆందోళన చెందుతున్నారు.