గణేష్ ఉత్సవాల (Ganesh Chaturdi) సమయంలో కారణం తెలుపకుండా నిర్వహిస్తున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) కు తాము హాజరవడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఆకస్మాత్తుగా ఈ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ఎవరికి తెలియదని ఆయన అన్నారు.
మహారాష్ట్రలో గణేశ్ ఉత్సవాలు ఉన్నాయని, అందువల్ల సమావేశాల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. అయితే లడఖ్‌ను చైనా ఆక్రమించడంపై సభలో చర్చ జరపాలని ప్రధాని మోదీ అనుకుంటున్నట్లు తమకు తెలిసిందన్నారు.
లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్‌లను చైనా తమ భూభాగాలుగా మ్యాప్‌లో చూపించడం ప్రధాని మోదీ తీవ్రంగా తీసుకుని…దానిపై చర్చించాలని భావిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు. అదేవిధంగా మణిపూర్ అల్లర్లు, చైనా దురాక్రమణపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అత్యవసరమైన విషయాలపై పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ జరిగితే బాగుంటుందని, అది దేశానికి మేలు చేస్తుందని ఆయన అన్నారు.
ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. అయితే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులతో పాటు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఇన్సూరెన్స్ సవరణ బిల్లులను మోదీ సర్కార్ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు సమాచారాం.
జీ20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఒక ప్రత్యేక తీర్మానం చేయనున్నదని పార్లమెంట్ వర్గాలు పేర్కొన్నాయి.