మూఢనమ్మకాలు మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావం చేసాయో లోకంలో జరిగే కొన్ని సంఘటనలను చూస్తే అర్థం అవుతోంది.. నమ్మకానికి.. మూఢ నమ్మకానికి తేడా తెలియక బంగారంలాంటి భవిష్యత్తును, జీవితాలను చేజేతులారా పాడుచేసుకునే వారిని లోకం పిచ్చి వారీగా చూస్తుంది. ప్రస్తుతం పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చుపెట్టగా.. ఓ గృహిణి ఆత్మహత్య చేసుకొన్న ఘటన నగరంలో జరిగింది.
హైదరాబాద్ (Hyderabad) అంబర్పేట (Amberpet)కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బబిత (28)కి, రాము (30)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానాజీగూడ (Kanajiguda) ఇందిరానగర్ (Indiranagar)లో కాపురం పెట్టిన ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత, ఓ యూట్యూబ్లో చెప్పిన జ్యోతిష్యం నిజమని నమ్మింది..
ఇదే విషయం భర్తతో తరచూ చెప్తే ఆయన తేలికగా తీసేసేవారని సమాచారం.. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా, కుమారుడు అంగన్వాడీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన చిన్నారి, తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించంతో భయపడిపోయాడు. వెంటనే కింది పోర్షన్లో ఉండే బాబాయికి చెప్పడంతో ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మరోవైపు విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రాముపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కుమార్త ఆత్మహత్య చేసుకొందని ఆరోపించారు. కానీ మృతురాలు భర్త మాత్రం, బబిత జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మేదని.. అలాంటివి నమ్మవద్దని తాను పదేపదే చెప్పినట్టు తెలిపారు.. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహం పట్టలేని రాము అందరి ముందు భార్యపై చేయిచేసుకొన్నట్టు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఇక విషయం తెలుసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..