విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing Harbour) అగ్ని ప్రమాద ఘటన (Fire Accident)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి ఆయన్ని వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. లోకల్ బాయ్ నాని తన భార్య శ్రీమంతం వేడుకలను నిన్న నిర్వహించారు.
శ్రీమంతం నేపథ్యంలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. వారితో కలిసి ఓ బోటులో ఆయన పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీన్ని వీడియో తీసి నాని తన యూట్యూబ్ ఛానెల్లో అప్ లోడ్ చేశారు. పడవలో నిప్పు ఎలా అంటుకున్నదనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది ఇలా వుంటే లంగర్ వేసిన ఆ పడవను మత్స్య కారులు నీటిలోకి వదిలేశారు. ఆ బోటు కాస్తా జట్టి నెంబర్ 1కు చేరుకుంది. అక్కడ ఆ బోటులోని మంటలకు పక్కనే ఉన్న పడవలోని సిలిండర్ పేలిపోయింది. దీంతో మరోసారి భారీగా మంటలు వ్యాపించాయి. పడవల్లో డీజిల్ ఉండటంతో పలు బోట్లు మొత్తం కాలి బూడిద అయ్యాయి.
ఘటనా స్థలం వద్ద మత్సకారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హార్బర్ వద్దకు మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హార్బర్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఘటన కారకులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు న్యాయం చేస్తామన్నారు.
గతంలో కూడా రెండు సార్లు హార్బర్ లో సడవలు దెబ్బ తిన్నాయన్నారు. డ్యామేజ్ అయిన బోట్ల విలువను అంచనా వేసి అందులో 80 శాతం వరకు నష్టపరిహారంగా అందిస్తామన్నారు. హుద్ హుద్ తుఫాన్, తిట్లి తుఫాన్ సమయంలో బోట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని గుర్తు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదన్నారు.