ఏపీ కాంగ్రెస్ (Congress) చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను పర్యటించే సమయంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు.
తనకు భద్రత కల్పించాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. తనపై ఏదో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పైగా భద్రత కల్పించాల్సింది పోయి ఉన్న భద్రతను తగ్గిస్తున్నారని ఆరోపించారు. మహిళా అని కూడా చూడకుండా… కనీసం తాము అడిగినా కూడా భద్రత కల్పించడం లేదని అన్నారు.
ఓ పార్టీకి అధ్యక్షురాలిని అనే కనీస గౌరవం కూడా లేకుండా తనను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే తనకు చెడు జరగాలని కోరుకుంటున్నారనే అర్థం అని చెప్పారు. అసలు మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్త శుద్ది ఉందా అని ప్రశ్నించారు.
మీకు సెక్యూరిటీ, మీ పెద్ద కోటలో మీరు ఉంటే సరిపోతుందా? అని నిలదీశారు. మిగతా నాయకులకు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. ప్రమాదం సంభవించడమే కాక, ప్రమాదం కల్పించే వారిలో కూడా మీవారు కూడా ఉంటారనేగా దాని అర్థం అని తీవ్ర ఆరోపణలు చేశారు. అంటే తమ చెడు కోరుకుంటున్నారనే కదా అర్థమని పేర్కొన్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని సీఎం జగన్ పై మండిపడ్డారు.