విశాఖ(Vizag) రాజధాని అంశంలో వైసీపీ విజన్(YCP Vision)పై ఏపీసీసీ చీఫ్ షర్మిల(APCC chief Sharmila) ఎక్స్(X) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్ అంటూ మండిపడ్డారు.
ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్ అని సెటైర్లు వేశారు. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్‌ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అంటూ చెప్పుకొచ్చారు. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అంటూ ధ్వజమెత్తారు.
ఇప్పుడు ఎన్నికల ముందు 10ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? అని షర్మిల ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖే ఉంటుందని సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏపీ డెవలప్‌మెంట్ డైలాగ్ సదస్సులో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు, చెన్నై తరహా అభివృద్ధి చేసే అవకాశం వైజాగ్‌లో ఉందని ఆయన తెలిపారు.
అదేవిధంగా విశాఖ ఏర్పాటులో తనకేమీ వ్యక్తిగత ఆలోచనలు లేవని తెలిపారు. వైజాగ్‌లో అవసరమైన అన్ని హంగులు ఉన్నందున ఇక్కడ రాజధాని అయితే బాగుంటుందని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్ర విభజన తో హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. సర్వీస్ సెక్టార్ తెలంగాణలో 62శాతం ఉంటే ఏపీలో 40శాతం మాత్రమే ఉందన్నారు. భవిష్యత్తులో విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్‌గా మారుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో షర్మిల వ్యాఖ్యలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి.