మాజీ సీఎం కేసీఆర్(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Komatireddy Venkat Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు దిక్కు లేకనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నదంతా దోచుకుతిన్నారని ఆరోపించారు.
మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు(jobs) భర్తీ చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. సిస్టమ్ ప్రకారమే గ్రూప్ 1, డీఎస్సీ నోటిఫికేషన్, ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట దిగజారిందని విమర్శించారు. గత ప్రభుత్వం రెండు పర్యాయాలు పాలించి 6 వేల స్కూళ్లు మూసివేసిందన్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదనీ.. కాంగ్రెస్ పార్టీ అత్యధిక 13 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందనీ.. అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఒకటో తేదీన జీతాలు వేస్తున్నపటికీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు నెలలుగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చారని ప్రతిపక్షం కామెంట్స్ చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రజలు కచ్చితంగా గెలిపిస్తారని కోమటి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని తెలిపారు. ఎన్నో మాటలు చెప్పే కేసీఆర్ రెండు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రాలేదని కోమటి రెడ్డి ప్రశ్నించారు.
యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని అన్నారు మంత్రి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు అవుతున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యిందనీ.. ఆ పార్టీ వాళ్ళే మమ్మల్ని అభినందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లోక్ సభ ఎన్నికల్లో కష్ట పడాలని కోమటిరెడ్డి సూచించారు.