వైటీపీ (YTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గజ్వేల్ (Gajwel) వెళ్లేందుకు బయటకొచ్చిన ఆమెను పోలీసులు (Police) అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పోలీసులు తనను అడ్డుకోవడంపై నిరసనగా.. వారికి హారతి ఇచ్చారు షర్మిల. దీంతో వారంతా షాకయ్యారు.
గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని అందుకే అడ్డుకున్నామని అంటున్నారు పోలీసులు. షర్మిల తన ఇంటి దగ్గరే బైఠాయించి నిరసనకు దిగారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ దొంగహామీలు ఇస్తున్నారని మండిపడ్డారు షర్మిల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని.. అలాగే, మూడెకరాల భూమి అంటూ ఘరానా మోసం చేశారని ఆరోపించారు.
గజ్వేల్ పర్యటన ఎందుకు?
తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని.. గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్ గ్రామానికి చెందిన కొందరు గురువారం వైటీపీ ఆఫీస్ కు వెళ్లారు. ఆ పార్టీ నేత నీలం రమేశ్ కు వినతిపత్రం ఇచ్చి షర్మిలకు అందజేయాలని కోరారు. తమ గ్రామం వచ్చి దళితబంధు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని విన్నవించారు. ఈ విషయం షర్మిల దృష్టికి వెళ్లింది. ఆమె.. తీగుల్ గ్రామానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.
షర్మిల గజ్వేల్ వస్తున్నారని తెలిసి బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆమె పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. దీంతో దీంతో తన టూర్ కు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు షర్మిల. సీఎం ఇలాకాలో జరిగిన అక్రమాలు భయటపడతాయని బీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని ఆమె మండిపడ్డారు. ఇదే క్రమంలో శుక్రవారం గజ్వేల్ కు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.