వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరాక ఢిల్లీలోనే ఉంటూ అక్కడి అగ్ర నేతలందరితో భేటీ అవుతున్నారు. నేడు(శుక్రవారం) పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun kharge)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద లౌకికపార్టీ అని తెలిపారు. అదేవిధంగా దేశ సంస్కృతిని కాపాడిందన్నారు. దేశ పునాదిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీనే అని షర్మిల చెప్పుకొచ్చారు. దేశంలో అన్ని వర్గాలకు సేవలందించిందన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా భారత ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని, ఆయన వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని తెలిపారు.
తెలంగాణలో కూడా గెలవడం ఖాయమని తెలిసి కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్కు మద్దతిచ్చానని తెలిపారు. బాధ్యతలు అప్పగింత అంశంపై చర్చలు జరుగుతున్నాయని, తనకు ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని షర్మిల స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఆ రకంగా తన పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాహుల్, ఖర్గే నాయకత్వంలో కుల, మత. వర్గ తేడాల్లేకుండా ప్రతీ వర్గానికి నమ్మకం కలిగించే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ సమావేశానికి హాజరయ్యారు.