గుంటూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ(AP) వైద్యారోగ్యశాఖ మంత్రి(Health Minister) విడదల రజిని(Vidadala Rajini) పార్టీ కార్యాలయంపై ఆకతాయిలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇవాళ(సోమవారం) పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు విడదల రజిని అక్కడకు చేరుకోనున్నారు.
ఈపార్టీ ఆఫీసు ఎదురుగానే ఎన్టీఆర్ విగ్రహం ఉంది. దీన్ని స్థానికుల ఎన్టీఆర్ సర్కిల్ అని పిలుస్తారు. న్యూ ఇయర్ కావడంతో అర్ధరాత్రి టీడీపీ కార్యకర్తలు పసుపు జెండాలు పట్టుకుని ర్యాలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ రాళ్లదాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఘటనతో పార్టీ ఆఫీసు ఎదుట జనం గుమిగూడారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కార్యాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో కొందరు పనివాళ్లు అర్ధరాత్రి అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. వారినీ పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల సంఖ్య తక్కువగా ఉండి.. వచ్చిన యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఆకతాయిల చర్యలను అడ్డుకునేలోపే కొందరు పారిపోయారు. త్వరలో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని న్యూఇయర్ రోజు ఉదయం 10గంటలకు ప్రారంభించాల్సి ఉండగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది.