ఎన్నికల మేనేస్టోను వైసీపీ విడుదల చేసింది. తాడేపల్లి(Tadepalli)లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం జగన్(CM Jagan) మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల మేనిఫెస్టో(Manifesto)లో ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాన్ని వివరించారు. ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు చేసిన వాటిని బేరీజు వేసుకోవాలని సూచించారు.
ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు పెద్ద మాయ చేశారంటూ విమర్శించారు. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని, పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తా అని ఒక్క రూపాయి అయినా మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. 2014లో అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఇచ్చారా? అని ప్రశ్నించారు. అదేవిధంగా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ ఒక్కొక్కటిగా సీఎం జగన్ వివరించారు. మాట ఇచ్చి అమలు చేయకపోతే విశ్వసనీయత కోల్పోయినట్లేనని విమర్శించారు.
తాము విద్య, వైద్యం వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తెచ్చామని తెలిపారు. 58 నెలల్లో రాష్ట్రంలో అనేక మార్పులు చేర్పులు తెచ్చామని వెల్లడించారు. గ్రామాల్లో అవినీతిలేని వివక్ష లేని వలంటీర్ వ్యవస్థను తెచ్చామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కారణంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు రోడ్డున పడ్డారని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాడని, సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడని అన్నారు. అవన్నీ అమలు చేయాలంటే రూ.1,21,619కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.
ఇక, 9 ముఖ్యమైన హామీలతో వైసీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్లు, నాడు- నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రతతో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించారు. వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంచనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంచనున్నారు.
రైతులకు పంట రుణాలు కొనసాగుతాయని, వైఎస్ఆర్ భీమా క్రింద ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మత్స్య కార భరోసా, వాహన మిత్ర కొనసాగుతాయని, స్వయం ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహన మిత్ర, సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వాళ్ళకి కూడా విస్తరిస్తామని చెప్పారు. ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా కలిగిస్తామని భరోసా కల్పించారు. లాయర్లకు లా నేస్తం కొనసాగింపు, చేనేత నేస్తం కొనసాగిస్తామని తెలిపారు.
వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంపు, అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు, వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.3 లక్షలు వరకు రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500కు పెంచబోతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తామని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు కొనసాగింపు, పట్టణ గృహ నిర్మాణ పథకం క్రింద ప్రతీ ఏటా వెయ్యి కోట్లు కేటాయింపు, రైతు భరోసా 13500 నుంచి 16వేలకు పెంచి మూడు దఫాల్లో అందజేస్తామని తెలిపారు.