Telugu News » US Firing: అగ్రరాజ్యంలో ఘోరం…!

US Firing: అగ్రరాజ్యంలో ఘోరం…!

ఈ కాల్పుల్లో 22 మంది వరకు మరణించినట్టు సమాచారం. సుమారు 80 మంది వరకు గాయపడినట్టు అధికారులు తెలిపారు.

by Ramu

వాషింగ్టన్, రాష్ట్ర:అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మైనేలోని లెవిస్టన్‌ లో జరిగిన కాల్పులలో 22 మంది మరణించారు. మరో 60 మంది వరకు గాయపడినట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

బౌలింగ్ అల్లేతో పాటు మరో బార్ అండ్ రెస్టారెంట్ వద్ద కాల్పులు జరిపినట్టు పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. షూటర్ ఫోటోలను పోలీసులు ఫేస్ బుక్‌ లో షేర్ చేశారు. ఎమర్జెన్సీ అలర్ట్ ను జారీ చేశారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు అండ్రో స్కోగిన్ కౌంటీ షరీఫ్ పోలీసు విభాగం పేర్కొంది.

మరోసారి కాల్పుల అవకాశాలు ఉన్నందున వ్యాపార సంస్థలను మూసి వుంచాలని కోరుతున్నట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని పోలీసులు సూచించారు. ఈ ఘటన గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్టు మైనే గవర్నర్ పేర్కొన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి 8 మైళ్ల దూరంలోని లిస్బన్‌ ప్రాంతంలో ఓ అనుమానాస్పద కారును గుర్తించిన పోలీసులు.. అది నిందితుడిదే కావచ్చని భావిస్తున్నారు.

మరోవైపు, లెవిస్టన్‌ కాల్పుల ఘటనపై అధ్యక్షుడు బైడెన్‌ కు సమాచారం అందినట్లు వైట్‌ హౌస్‌ వెల్లడించింది. మైనే గవర్నర్‌ జానెత్‌ మిల్స్‌ తోపాటు సెనెటర్లతో బైడెన్‌ ఫోన్‌ లో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మైనేకు అండగా ఉంటామని బైడెన్‌ హామీ ఇచ్చినట్లు వైట్‌ హౌస్‌ పేర్కొంది.

You may also like

Leave a Comment