మనిషి నిజంగా ఎలా జీవించాలో హిందూత్వం చెప్తుంది. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయే వరుకు ఏం చెయ్యాలో, సమాజంలో ఎలా ఉండాలో మార్గం చూపిస్తుంది. ఇతర ప్రాణులతో ఎలా మెలగాలి అనేది కూడా నేర్పిస్తుంది. హిందూ ధర్మం వెనుక లోకం హితం ఉంది. దానిని సక్రమంగా ఆచరిస్తే ‘‘సర్వేజనా సుఖినోభావంతు’’.. లోకం అంతా సుఖశాంతులతో వర్దిల్లుతుందని పెద్దలు చెప్తుంటారు. హిందూత్వంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా.. ఎన్ని వాదనలు ఉన్నా.. అంతిమ సందేశం మనిషి ఎలా బతకాలో చెప్పడమే. ఇది గమనించిన విదేశీయులు హిందూ ధర్మం వైపు అడుగులు వేస్తున్నారు.
ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చెందినవారు హిందూత్వం, దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు భారత్ కు వస్తున్నారు. కొందరైతే ఆధ్యాత్మిక చింతనలో ఇక్కడే ఉండిపోతున్నారు. అలాంటి ఓ యువతి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోయంబత్తూర్ లోని ఈశా యోగా సెంటర్ కు వెళ్తే.. ఎర్రటి చీరతో, నిండైన బొట్టుతో లింగా భైరవి ఆలయంలో పాతికేళ్ల యువతి అర్చకత్వం చేస్తూ కనిపిస్తుంది. ఇది చూసిన ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. లెబనాన్ కు చెందిన ఈమె క్రిస్టియన్. అయినా కూడా ఎంతో చక్కగా అర్చకత్వం చేస్తుంది. అమ్మవారి సేవలో తరిస్తుంటుంది.
భైరాగిని మా హనీన్ గా పిలిచే ఈమె.. లక్షల రూపాయల జీతమున్న ఉద్యోగాన్ని వదులకుని కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ లో స్థిరపడిపోయింది. దైవ సన్నిధిలోనే తన జీవితాన్ని గడుపుతోంది. లెబనాన్ లో ఓ సంస్థలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసింది ఈ యువతి. దైవభక్తి చాలా ఎక్కువ. ముఖ్యంగా హిందూ ధర్మం అంటే గౌరవం. అందుకే, విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని ఇలా ఆలయంలో అర్చకత్వం చేస్తోంది. ఇలా ఎందుకు జీవిస్తున్నారని ఆమెను అడిగితే.. ఎన్నో విషయాలను చెబుతోంది.
‘‘లెబనాన్ లో నేను ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశాను. కానీ, ఈశా యోగా సెంటర్ గురించి తెలిశాక 2009లో ఫుల్ టైమ్ వాలంటీర్ గా చేరిపోయాను. దాదాపు 14 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు భక్తి, యోగా గురించి ఏమీ తెలియదు. ఆ సమయంలోనే నా స్నేహితురాలు చనిపోయింది. చాలా ప్రశ్నలు నా మనసులో మెదిలాయి. ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నించాను. అప్పుడే ఈశా యోగా సెంటర్ లో ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ చేశాను. వెంటనే లెబనాన్ కి వెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశాను. ఇక్కడ ఇలా ఉండడం నాకు చాలా సంతృప్తినిస్తోంది. నేను క్రైస్తవురాలినే. కాకపోతే, హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నన్ను ఇలా మార్చేసింది’’ అని తన జీవితాన్ని వివరిస్తోంది భైరాగిని మా హనీన్.