తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే(Goshamahal Bjp Mla) రాజాసింగ్(Rajasingh) వెల్లడించారు. తనను, తన కుంటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హతమారుస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లుగా రాజాసింగ్ తెలిపారు.
ఈ మేరకు ఓ వీడియోతో పాటుగా నగర పోలీసు కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను రాజాసింగ్ విడుదల చేశారు. అయితే తనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం కొత్తేమీ కాదని రాజాసింగ్ తెలిపారు. ఇదివరకు విదేశాల నుంచి సైతం తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. వాటిపై తాను సీపీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినా.. వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు.
తనకు వచ్చిన బెదిరింపు కాల్లో సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడిన ఆ వ్యక్తి.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించినట్లుగా రాజాసింగ్ వివరించారు. తన కదలికలను సైతం ఆ వ్యక్తి వివరంగా చెప్పాడని, ఏ సమయంలోనైనా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ వెల్లడించారు.
బెదిరింపులకు జంకేది లేదని రాజాసింగ్ తేల్చిచెప్పారు. ‘ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తమ సంకల్పం మాత్రం అఖండ హిందూ రాష్ట్ర సాధనే..’ అని రాజాసింగ్ తెలిపారు. వివాస్పద వ్యాఖ్యలకు సస్పెన్షన్‌కు గురైన ఆయనకు ఇటీవలే బీజేపీ అధిష్టానం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్సింగ్కు మరోసారి టికెట్ కేటాయించడంతో ఆయన గోషామహల్లో మరోసారి బరిలో ఉన్నారు.