‘చంద్రబాబు చస్తాడు’ అంటూ తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత నారాచంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu)పై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ హిందూపురం ఎంపీ(Hindupuram Mp) గోరంట్ల మాధవ్(Gorantla Madhav) ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ తన మాటలను వక్రీకరిస్తోందని ఆరోపించారు. పద దోషంతో అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే తన ఉద్దేశం అని స్పష్టం చేశారు.
‘2024లో నారా చంద్రబాబు చస్తారంటూ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టారు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి.. ఢిల్లీ యాత్ర చేశారు. పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టి.. వదిలిపెట్టి పారిపోయే యాత్ర చేస్తున్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా.. జగన్ జైత్రయాత్రను ఆపలేరు. 2024లో జగన్ సీఎం అవుతారు. చంద్రబాబు చస్తాడు’ అని గోరంట్ల హాట్ కామెంట్స్ చేశారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఎంపీ గోరంట్ల ఏంటి ఇలా అనేశారు? అని జనాలు మాట్లాడుకునేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింపు టీడీపీ శ్రేణులు రాష్ట్రమంతా నిరసన జ్వాలలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు.
‘నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది. పద దోషంతో నారా చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. వాఖ్య నిర్మాణం లోపం వల్ల అలా మాట్లాడాను. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే నా ఉద్దేశం. 2024 ఎన్నికల్లో వైసీపీకి 175సీట్లు ఖాయం. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ సమాధి అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇంగ్లీష్ మీడియం విద్య జగన్ పుణ్యమే’ అని గోరంట్ల మాధవ్ అన్నారు.