తెలంగాణ (Telangana) రాజకీయ నేతలు బిజీబిజీగా మారిపోయారు. ప్రచారంలో, విమర్శలలో తమకు ఎదురు లేదని నిరూపించుకుంటున్నారు. మరోవైపు టికెట్ దక్కని నేతలు పక్క పార్టీలోకి వెళ్ళి ఇన్నాళ్ళూ ఉన్న పార్టీ పై ఊహించని స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వీరి విమర్శలు విన్న సామాన్యులు పదవులు అనుభవించేటప్పుడు ప్రజల గోస, చేసిన అన్యాయం గుర్తుకు రాదు కానీ పార్టీ విడగానే హఠాత్తుగా జ్ఞానోదయం అయిన మునీలా మాట్లాడం నేతలకే చెల్లుతుందని అనుకుంటున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి.
ఇక బీఆర్‌ఎస్ (BRS)తో దోస్తాన్ చెడి హస్తం పార్టీతో హస్తాన్ని కలిపిన మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao).. హరీశ్‌రావు (Harish Rao) మల్లారెడ్డి (Mallareddy)పై మాటల తూటాలు వదిలారు. మెదక్‌లో జరిగిన కాంగ్రెస్ (Congress) విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న మైనంపల్లి.. ఖబడ్ధార్ హరీశ్‌రావు అంటూ వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమన్న మైనంపల్లి.. జైలు ఉచలు లెక్కపెట్టడానికి సిద్దంగా ఉండాలని హరీశ్ రావుని, ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డిని హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకే అన్ని పథకాలు అందిస్తూ ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారని మైనంపల్లి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లాకు పట్టిన శని హరీశ్ రావు అని పేర్కొన్న మైనంపల్లి ఇంకో నెలలో ఆ శని పోతుందన్నారు. ఇప్పటికే ఓడిపోతామనే భయంతో కోట్లు పెట్టి నాయకులని కొంటున్నారని మైనంపల్లి ఆరోపించారు.