రాజకీయాల్లో అవినీతి మరక అంటని నాయకున్ని చూడాలంటే కష్టం. పదవులే పరమావధిగా.. అధికారం, డబ్బు సంపాదించడమే ధ్యేయంగా రాజకీయ ప్రవేశం జరుగుతుందని మేధావులు సైతం గొంతు చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు.. ఎలక్షన్ బడ్జెట్.. ఆకాశాన్ని తాకేలా మార్చారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల్లో, డబ్బులేని మేధావి, పోటీ చేసే పరిస్థితులు లేవన్నది జగమెరిగిన సత్యం..
ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) అన్నీ పార్టీలు సిద్దం అయ్యాయి. జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఓటర్లను (voters) మభ్యపెట్టకుండా అధికారులు చర్యలు గట్టిగానే చేపట్టారు.. కానీ ప్రవహించే నదికి చేతులు అడ్డుపెడితే ఆగుతుందా! అన్నట్టుగా లెక్కలేనన్ని నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరోవైపు ఓటర్లకు పంచడానికి సిద్దంగా ఉన్న తాయిలాలు కూడా సీజ్ చేస్తున్నారు. ఈ ఎన్నికలను ఈసీ (EC) కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల నియమాలను కఠినంగా అమలు చేస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాల జారీ చేసింది.
ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశించింది. ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో సీజ్ చేసిన మొత్తం రూ.400 కోట్ల రూపాయల మార్క్ దాటడం విశేషం.. మొత్తం రూ.412.46 కోట్లు అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు స్వాధీనపరచుకున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం 60 మంది అధికారులను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం వ్యయ పరిశీలకులుగా నియమించింది. కాగా ఇప్పటికే వంద కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. ఇక ఎల్లుండి శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను సమీక్షించనుంది.
ఇందులో భాగంగా సీఈసీ బృందం ఇవాళ హైదరాబాద్లో అధికారులతో సమావేశం కానున్నారు. ఓటర్ జాబితా, స్లిప్పుల పంపిణీ, ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాల ముద్రణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై ఆరా తీయనున్నారు. మరోవైపు నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.