ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ బాగా పెరిగిపోయింది. అయితే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల దరఖాస్తు చేసుకున్న 25ఏళ్లకు జాబ్ వచ్చిన ఘటన వెలుగుచూసింది. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈసారి వచ్చింది జాబ్ కాదు.. హాల్ టికెట్. అవునండీ.. దరఖాస్తు చేసుకున్న ఏడేళ్ల తర్వాత ఓ వ్యక్తికి హాల్ టికెట్ వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది. అతడు 2016లో దరఖాస్తు చేసుకుంటే 2023లో అంటే.. ఏడేళ్ల తర్వాత అడ్మిట్ కార్డు అందింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది.
2016 మార్చి నెలలో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ అనే అభ్యర్థి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నియామక పరీక్ష అదే ఏడాది డిసెంబర్లో జరిగింది. అయితే హాల్‌టికెట్ రాకపోవడంతో అతడు పరీక్షకు హాజరుకాలేకపోయాడు.
అయితే ఈ నెల 1న అతనికి ఓ మెయిల్ ఓ వచ్చింది. అదిచూసి అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. తీరా దానిని ఓపెన్ చేసి చూడగా ఏడేండ్ల కింద తాను దరఖాస్తు చేసిన అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన అడ్మిట్‌కార్డు. ఇన్నేళ్ల తర్వాత హాల్‌టికెట్ రావడంతో షాక్ అయిన అతడు అసహనానికి లోనయ్యాడు. ఈ ఆలస్యానికి కారణం ఎవరు? అది ఇప్పుడు ఎందుకు వచ్చింది..? అనే విషయమై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్తానని బాధితుడు తెలిపాడు.