‘లియో’(Leo) సినిమాలో విలన్ పాత్రలో నటించిన మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) ఇటీవల హీరోయిన్ త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల మన్సూర్ అలీ.. సోషల్ మీడియాలో త్రిషకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే.
త్రిషపై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. తాను సరదాగానే ఆ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. అయితే, మన్సూర్ క్షమాపణలు చెప్పడంపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘సమాజంలో మనుషులు తప్పు చేస్తుంటారు. అలాంటప్పుడు వారిని క్షమించడమే గొప్ప విషయం’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్టైంది. ప్రస్తుతం త్రిష ట్వీట్ వైరల్ అవుతోంది.
అసలేం.. జరిగిందంటే మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో ‘లియో’ సినిమా గురించి మాట్లాడుతూ.. గతంలో ఎన్నో రేప్ సీన్లలో నటించానని తెలిపాడు. అయితే, లియో చిత్రంలో త్రిషతో అలాంటి సీన్ లేకపోవడం బాధకలిగించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నటుడి వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ ప్రముఖులు సైతం అతడిపై మండిపడ్డారు. త్రిష సైతం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు మన్సూర్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో పోలీసులు అతడిపై కేసు కూడా నమోదు చేశారు. నడిగర్ సంఘం సైతం ఆయనపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో మన్సూర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఇందుకు త్రిష కూడా క్షమించడమే గొప్ప విషయం అని పేర్కొనడంతో ఈ వివాదానికి చెక్ పడినట్లైంది.
To err is human,to forgive is divine🙏🏻
— Trish (@trishtrashers) November 24, 2023