తిరుమల (Tirumala) నడక మార్గంలో జంతువుల సంచారం భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అసలే, చిరుతల టెన్షన్ లో ఉన్న వారికి ఎలుగుబంటి కనిపించి హడలెత్తించింది. ఇలా వరుస ఘటనల నేపథ్యంలో టీటీడీ (TTD) పాలక మండలి సమావేశమై.. హైలెవల్ మీటింగ్ నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే.. భక్తులకు కర్ర ఇవ్వాలన్న అంశం చుట్టూ సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.
తిరుమలకు నడకమార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఓ చేతి కర్ర ఇస్తామని కొత్తగా టీటీడీ చైర్మన్ పోస్ట్ లోకి వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ప్రకటించారు. జంతువులు దాడి చేస్తే కర్రతో రక్షణ పొందాలని వాటిని కొట్టాలన్నారు. చేతిలో కర్ర ఉంటే జంతువులు భయపడతాయని.. ఆత్మ రక్షణ కోసం అలిపిరి మార్గం నుంచి తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి ఓ కర్రను ఇస్తామని సంచలన ప్రకటన చేశారాయన. అయితే.. ఇది వర్కవుట్ అయ్యేది కాదనేది కొందరి వాదన. ఇది వింతగా ఉందని వారు అంటున్నారు.
నిత్యం తిరుమల కొండపైకి 20వేల నుంచి 30వేల మంది భక్తులు నడక మార్గంలో వెళ్తుంటారు. మరి, వాళ్లందరికీ కర్రలు సప్లయ్ చేయడం మామూలు విషయం కాదు. ఇది, సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ, ఇచ్చినా వాటి సరఫరా, ఖర్చు పెరిగిపోతాయని అంటున్నారు. పైగా, కర్ర చేతిలో పట్టుకుని మెట్లు ఎలా ఎక్కాలని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా నడకదారిలో నడవటం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది కర్ర పట్టుకుని పిల్లలు, పెద్ద వయస్సు వారు మెట్లు ఎలా ఎక్కుతారని ప్రశ్నిస్తున్నారు.
మెట్లమార్గంలో కొందరు భక్తులు నడుస్తూనే పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ ఎక్కుతారు. ఇలాంటి వారికి కర్ర ఇస్తే వారి మొక్కులు ఎలా తీర్చుతారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా ‘కర్ర’ నిర్ణయంతో టీటీడీ కొత్త చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది.