మొన్నటి వరదలు, నష్టంపై సమగ్ర నివేదిక తయారీకి తమకు ఇంకా గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్ పై విచారణ జరగగా.. నివేదిక సమర్పించడానికి మరింత సమయం కావాలని కోరింది సర్కార్. వరదలు, నివారణ చర్యలు, ఎక్స్ గ్రేషియా వంటి వివరాలపై పూర్తి నివేదికను రెండు రోజుల్లో అందజేస్తామని తెలిపింది.
ప్రభుత్వం సమయం కోరడంతో.. ఆ నివేదిక వచ్చాకే వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. వరదల ప్రభావంతో మోరంచపల్లిలో చనిపోయన మరో ఇద్దరి పేర్లను లిస్టులోకి చేర్చలేదని అన్నారు. వారిని కూడా చేర్చాలని కోరారు. దీంతో దీన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్నిఆదేశించింది హైకోర్టు. ఇప్పుడు మళ్లీ వర్షాలు ఉంటాయని వాతావరశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక వినతి చేశారు పిటిషనర్.
వర్షాల నేపథ్యంలో ఈసారన్నా మరింత అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది న్యాయస్థానం. గత విచారణ సందర్భంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తమకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అంతకుముందు ఆదేశించిన నేపథ్యంలో రెండోసారి నివేదికను అందజేసింది ప్రభుత్వం. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు రిపోర్ట్ లో పేర్కొంది. అలాగే, రూ.500 కోట్లను పునరావాసం కోసం కేటాయించినట్లు వివరించింది. అయితే.. ఈ నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు.
వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. రూ.500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని తెలిపింది. అలాగే, ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. గురువారం మరోసారి విచారణ జరపగా.. ఇంకా టైమ్ కావాలని ప్రభుత్వం కోరింది.