ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Goutham Adani) కొత్త ఏడాదిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్(Bloomberg Billionaires) ధనవంతుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండగా అదానీ నికర విలువ ఇవాళ ఉదయం 9.30గంటలకు 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
అదానీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకరోజు కిందట రూ.14.47 లక్షల కోట్ల నుంచి బుధవారం నాటికి రూ.15.11 లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 97 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి నలిచారు.
ప్రపంచంలో 13వ స్థానానికి అంబానీ దిగజారిపోయారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని టాప్ -20 బిలియనీర్లలో ముగ్గురి నికర విలువ మాత్రమే పెరిగినట్లు చెప్పింది. వీటిలో అదానీ, అంబానీలే కాకుండా అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ కూడా ఉన్నారు.
గౌతమ్ అదానీ నికర విలువలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఆయన సంపద 24 గంటల్లో 7.6 బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొనింది. అయితే, అదానీ గ్రూపు చెందిన పది లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్కు దాదాపు 65,500 కోట్ల రూపాయలను జోడించింది.