తెలంగాణ (Telangana)లో మద్యం వ్యసనంతో పాటు మాదక ద్రవ్యాల కల్చర్ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదకద్రవ్యాల వరకు వెళ్ళడం.. పొంచి ఉన్న ముప్పును సూచిస్తోందని అంటున్నారు.. మరోవైపు నగరంలో స్నేహితుల బర్త్‌డే వేడుకల్లో, వీకెండ్ పార్టీల్లో, మాదకద్రవ్యాలు.. మత్తు పదార్థాలు.. గంజాయి వంటివి తీసుకోవడం సాధారణమైపోయిందనే ఆరోపణలున్నాయి..
వీటికి బానిసలవుతోన్న యువత.. డబ్బు కోసం బైకులు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు చోరీ చేయడం, లేదా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడటం లాంటివి చేస్తోన్నట్లు పోలీసుల పరిశీలనలో అనేక సార్లు స్పష్టమైంది. అయితే హెరాయిన్, కొకైన్, ఓపియం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా కోట్ల వ్యాపారం చేస్తోన్న మాఫియా.. విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దందా నడిపిస్తోన్నట్టు ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలో నిత్యం హైదరాబాద్ (Hyderabad)లో ఎక్కడో ఓ చోట మాదక ద్రవ్యాలు పట్టుపడుతూనే ఉన్నాయి. కాగా హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో డిసెంబర్ 31 ఇయర్ ఎండ్ పార్టీల్లో, పబ్‌ల్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయాలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈమేరకు పోలీసు అధికారులు సైతం కఠినంగా వ్యవహరిస్తూ.. కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు..
ఈ క్రమంలో ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు రవాణా అవుతోన్న గంజాయి పట్టుబడింది. వీటిని తీసుకొస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. విధుల్లో భాగంగా అర్ధరాత్రి అబ్దుల్లాపూర్ మెట్ (Abdullahpur Met)వద్ద, విజయవాడ (Vijayawada) జాతీయ రహదారిపై వచ్చే ట్రావెల్స్ బస్సులలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.. ఈ నేపథ్యంలో మూడు బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. దీంతో అనుమానస్పదంగా ఉన్న10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఏజెన్సీ ఏరియాల నుంచి బస్సుల ద్వారా నగరానికి గంజాయి తరలిస్తున్నట్టు వెల్లడించారు.