పవిత్రమైన ధనుర్మాసం ఈనెల 14వ తేదీ ఆదివారం (Sunday) ముగియనుండడంతో 15వ తేదీ సోమవారం (Monday) నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.. గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజూమున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో.. శ్రీవారి ఆలయంలో ఇప్పటి వరకు సుప్రభాత సేవ స్థానంలో, గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది.
అయితే జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తికానుండటంతో, 15వ తేదీ నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ మొదలవుతోన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అదేవిధంగా జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయని పేర్కొన్నారు..
మరోవైపు తిరుమల (Thirumala) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకొంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించకొంటున్నారు.
కాగా, శుక్రవారం శ్రీవారి 56,588 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 16,754 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.26కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.