భోగి పండుగ అందరింట్లో ఆనందాన్ని నింపితే.. ఆ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆరాటపడ్డ ఆ ఇంటిలో ఎన్నడూ తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తూ మురిసిపోతున్న యువతిని, లారీ మృత్యువువై కబళించింది. ఏపీలో జరిగిన ప్రమాద ఘటన వివరాలు తెలుసుకొంటే..
ఏలూరు (Eluru) జిల్లా మండవల్లి ( Mandavalli) మండలం కానుకొల్లు (Kanukollu)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భోగి పండుగ సందర్భంగా వాకిట్లో ముగ్గులు వేస్తున్న పల్లవి దుర్గ, తేజస్విని అనే అక్కాచెల్లెళ్లపై లారీ దూసుకు రావడంతో.. తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో పల్లవి తీవ్రంగా గాయపడింది. గాయపడిన పల్లవిని స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ లారీ ఇటుకల లోడుతో గుడివాడ నుంచి కైకలూరు వెళ్తున్నట్టు సమాచారం..
మరోవైపు స్థానికులు లారీ డ్రైవర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు పరారైనట్టు తెలుస్తోంది. అయితే అతడితో పాటు ఉన్న మరొక వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా రాంగ్రూట్లో అతివేగంగా వచ్చి లారీ ఢీకొట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కలగుంట వద్ద ప్రమాదం చోటుచేసుకొంది. కలగుంట జాతీయ రహదారిపై బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో, ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం..